Kanaka-Durga-Temple : సామాన్య భక్తుడే వీఐపీ Andhra Prabha Top News

Kanaka-Durga-Temple : సామాన్య భక్తుడే వీఐపీ Andhra Prabha Top News

  • సేవలే ప్రధమ లక్ష్యం
  • భక్తుల సౌకర్యాలే తొలి ప్రాధాన్యం
  • క్యూఆర్ కోడ్ ఆధారిత వీఐపీ దర్శనం
  • కనకదుర్గ సదన్ నిర్మాణంతో వసతి
  • అవినీతి, అనధికార దర్శనాలకు తావులేదు
  • ప్రతి భక్తుడు సంతృప్తిగా వెళ్లాలన్నదే సంకల్పం
  • శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం
  • కార్యనిర్వాహణ అధికారి వీకే శీనా నాయక్…

(ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ)

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) డీవీకే శీనా నాయక్ స్పష్టం చేశారు. ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, అవినీతి నిరోధక చర్యలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు తదితర అంశాలపై ఆయన ప్రత్యేక ముఖాముఖిలో పలు కీలక విషయాలను వెల్లడించారు.

Kanaka-Durga-Temple : దేవస్థానంలో ఎన్నో సంస్కరణలు…

ఈవోగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిందని, ఈ కాలంలో ఆలయంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, ప్రజాప్రతినిధుల మార్గదర్శకత్వంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. భక్తుడి కోణంలో ఆలోచిస్తూ సేవలు అందించడమే తమ పని తీరుగా పేర్కొన్నారు.

Kanaka-Durga-Temple : అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు…

భక్తులకు తాగునీరు, విశ్రాంతి సౌకర్యాలు, ఉచిత లడ్డూ ప్రసాదం, నాణ్యమైన అన్నప్రసాదం, క్యూ లైన్ నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఈవో శీనా నాయక్ వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడా దోపిడీకి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. చెప్పుల స్టాండ్ వద్ద నామమాత్రంగా రూ.3 మాత్రమే వసూలు చేస్తున్నామని, ఎవరైనా అధికంగా వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కోసం వాట్సాప్, పీజీఆర్‌ఎస్ తదితర వ్యవస్థలను అందుబాటులో ఉంచామని తెలిపారు.

Kanaka-Durga-Temple : త్వరలో డిజిటల్ లాకర్లు…

భక్తుల సెల్‌ఫోన్లు, విలువైన వస్తువుల భద్రత కోసం పూర్తిగా డిజిటల్ విధానంలో లాకర్ వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈవో శీనా నాయక్ వెల్లడించారు. బ్యాంకు సహకారంతో ఈ వ్యవస్థను అమలు చేయనున్నామని చెప్పారు. అలాగే వీఐపీ దర్శనాల్లో పారదర్శకత కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ప్రోటోకాల్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.

Kanaka-Durga-Temple : అవినీతిపై రాజీ లేదు…

ఆలయంలో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వబోమని ఈవో స్పష్టం చేశారు. చిన్న ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతిరోజూ అధికారులు భక్తుల మధ్య తిరుగుతూ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నారని చెప్పారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సేవల్లో రాజీ పడకుండా అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి నిరంతర శిక్షణ, పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

Kanaka-Durga-Temple : కనకదుర్గ సదన్ నిర్మాణం…

భక్తులకు వసతి కల్పించే దిశగా “కనకదుర్గ సదన్” పేరుతో భారీ భవనం నిర్మించనున్నట్లు ఈఓ శీనా నాయక్ ప్రకటించారు. రెండు అంతస్తుల్లో పార్కింగ్, రెండు అంతస్తుల్లో డార్మిటరీలు, పై అంతస్తుల్లో సుమారు 120 గదులు నిర్మించేలా ప్రణాళిక సిద్ధమైందన్నారు. ట్రస్ట్ బోర్డు ఆమోదం అనంతరం పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

Kanaka-Durga-Temple : అన్ని హంగులతో భవనాలు..

మహా మండపం, ఆధునిక అన్నప్రసాద భవనం, లడ్డూ పోటు భవనం పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. మహా మండపంలో ఒకేసారి వేలాది మంది భక్తులు వేచి ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 300 మందికి అన్నప్రసాదం అందిస్తుండగా, కొత్త భవనం అందుబాటులోకి వస్తే ఒకేసారి మూడు వేల మందికి భోజనం అందించే సామర్థ్యం ఏర్పడుతుందని వెల్లడించారు.

Kanaka-Durga-Temple : కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక కార్యాచరణ..

రాబోయే కృష్ణా పుష్కరాల నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. కుమ్మరిపాలెం ప్రాంతంలో పార్కింగ్ స్థలాలు, అదనపు క్యూ లైన్లు, ఉచిత బస్సులు, భక్తుల రవాణా కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు.

Kanaka-Durga-Temple : పెరుగుతున్న భక్తుల సంఖ్య…

సాధారణ రోజుల్లో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది వరకు, శుక్రవారం, శనివారం, ఆదివారం, పర్వదినాల్లో 75 వేల నుంచి 80 వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. గతంతో పోలిస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది ఆలయంలో మెరుగైన సేవలపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Kanaka-Durga-Temple : అమ్మవారి సేవే అత్యున్నత భాగ్యం..

ఇంద్రకీలాద్రిపై స్వయంభూ కనకదుర్గమ్మకు సేవ చేసే అవకాశం తనకు దక్కడం జీవితంలో గొప్ప అదృష్టమని ఈఓ వీకే శీనా నాయక్ భావోద్వేగంగా పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా ఇంద్రకీలాద్రికి వచ్చి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, వారి కష్టాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి భక్తుడు సంతృప్తిగా తిరిగి వెళ్లేలా సేవలందించడమే తమ పరమ ధ్యేయమని స్పష్టం చేశారు.