Farmer Welfare | మంత్రి అచ్చెన్న కీలక ఆదేశాలు!

ఖరీఫ్‌కు సాగునీరు, ఎరువులపై ప్రత్యేక దృష్టి

అమరావతి, ఆంధ్రప్రభ: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు, ఎరువుల సరఫరా పకడ్బందీగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

ఖరీఫ్‌ సాగుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. రైతులకు అవసరమైన వనరులు సకాలంలో అందేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా కాలువల చివరి ఆయకట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, తొలి ప్రాధాన్యంతో సాగునీరు అందించాలని స్పష్టం చేశారు.

సాగునీటి సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల పంటలకు అవసరమైన నీరు అందితేనే మంచి దిగుబడులు సాధ్యమవుతాయని, అందుకు అనుగుణంగా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అలాగే ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు అందించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. రైతు సంతృప్తే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.