సీఎంఆర్ ధాన్యం అక్రమాలకు పడని అడ్డుకట్ట

ధాన్యం మింగిన వారిని జైలుకు పంపుతున్నా.. కొందరు మిల్లర్లలో కానరాని మార్పు

మండలంలోని ఇద్దరు మిల్లర్లపై క్రిమినల్ కేసులు
అక్రమాలు తేల్చిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

హనుమకొండ/శాయంపేట ఆంధ్రప్రభ : ప్రభుత్వం సిఎంఆర్ విషయంలో కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కొందరు రైస్ మిల్లర్ల తీరు మారడం లేదు. క్లస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్ ) కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం ఇవ్వకుండా.. ధాన్యం పక్కదారి పట్టించి కోట్లలో అక్రమాలకు పాల్పడుతున్నారు. కేసులు పెట్టి జైలుకు పంపిన ఇంకా కొందరు మిల్లర్లలో మార్పు రావడం లేదు. తాజాగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు గట్ల కానిపర్తి లోని మిల్లులలో తనిఖీలు చేసి రెండు మిల్లులలో ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.


రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించింది. తిరిగి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిన మిల్లర్లు తమ ఇష్టానుసారంగా అమ్ముకుంటూ ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మీ నరసింహ, శ్రీ వినాయక మిల్లులలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా రూ. 9 కోట్ల విలువ గల 3129 మెట్రిక్ టన్నుల ధాన్యం లేదు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆదేశాలు మేరకు సివిల్ సప్లై అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ దాడులలో 2025- 26 ఖరీఫ్, రవి సీజన్ ధాన్యంపై తనిఖీలు తీశారు. గతంలో ఈ విధంగా దాడులు జరిగినప్పుడు ఒక సీజన్ కు సంబంధించిన ధాన్యం మరొక సీజన్ కు చూపించేవారనే, అలాగే రేషన్ బియ్యం కొనుగోలు చేసి లెక్కలలో చూపేవారని ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల పర్యవేక్షణ ఏది..?

మిల్లులపై నిత్యం తనిఖీలు చేయాల్సిన సివిల్ సప్లై అధికారులు తనిఖీలు మరిచి మిల్లర్లకు దాసోహం కావడంతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
స్టేట్ నుండి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసే వరకు సివిల్ సప్లై అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూనే ఉన్నారు. జిల్లా స్థాయిలో సివిల్ సప్లై అధికారుల అండదండలతో మిల్లర్లు మండల స్థాయిలో ఉండే అధికారులకు కనీసం స్పందించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని నిత్యం తనిఖీలు చేస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని జనాలు కోరుతున్నారు.