స్నేహితుడి కుటుంబానికి ‘పదో తరగతి మిత్రుల’ అండ

అనాథలైన ఇద్దరు చిన్నారుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయం

రేగొండ, ఆంధ్రప్రభ: అకాల మరణం చెందిన పాఠశాల మిత్రుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు పదో తరగతి పూర్వ విద్యార్థులు ఉదారత చాటుకుని మానవత్వాన్ని చాటారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఏడాది క్రితమే ఆయన భార్య కూడా మరణించడంతో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి బాల్య మిత్రులు వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించారు. 2002లో శ్రీనివాస్ రెడ్డితో కలిసి పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఒక్కటై రూ.25 వేల ఆర్థిక సాయాన్ని సేకరించి శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు.

చిన్ననాటి మిత్రుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఆయన పిల్లలకు భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం అందిస్తూ అండగా ఉంటామని మిత్రులు భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రజిత, మంజుల, సువర్ణ, మనోహర్, చందు, రాజు, రాజేందర్, భాస్కర్, సంతోష్, అమరేందర్, తిరుపతి, మధుకర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.