ప్రభుత్వ ఆసుపత్రి దారిలో వర్షపు నీరు..
పేషెంట్లకు తప్పని ఇబ్బందులు
వర్షపు నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజల డిమాండ్
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో రోగులు, వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రికి వెళ్లే ప్రధాన దారిలో నీరు నిలిచి, దుర్వాసన వెదజల్లుతుండటంతో రోగులు ఆ మార్గంలో వెళ్లేందుకు జంకుతున్న పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా రహదారిపై నీరు నిలిచిపోవడంతో పాటు ఆసుపత్రి ముందున్న మురుగు కాలువ నుంచి దుర్వాసన వస్తుండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.
వైద్యం కోసం వచ్చే వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, ఇతర రోగులు నిల్వ ఉన్న నీటిని దాటుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు కూడా నీటిలో జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మురుగునీరు రోజుల తరబడి నిలిచి ఉండటంతో దోమలు పెరిగి పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలే వర్షపు నీటితో నిండిపోవడం పట్ల రోగులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా వర్షపు నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం చూపాలని, అవసరమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. తక్షణమే నిల్వ నీటిని తొలగించి, ఆసుపత్రికి వెళ్లే మార్గాన్ని శుభ్రపరచడంతో పాటు భవిష్యత్తులో వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు ఆసుపత్రి దారి ఇబ్బందికరంగా మారకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
