వరుణుడి కరుణ కోసం..

గ్రామదేవతలకు అభిషేకం
మొహమ్మదాబాద్‌లో భక్తిశ్రద్ధలతో పూజలు
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని రైతుల ప్రార్థనలు

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు కళకళలాడాలని ఆకాంక్షిస్తూ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ గ్రామంలో రైతులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణదేవుడి అనుగ్రహం కోసం గ్రామదేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాకాల ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలతో జుక్కల్ ప్రాంత రైతులు పెసర, మినుము, కంది, పత్తి, సోయాబీన్ తదితర పంటలను వేలాది ఎకరాల్లో సాగు చేశారు. అయితే పంటలు వేసిన తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, ఎండ తీవ్రత పెరగడం, ఈదురుగాలుల ప్రభావంతో పంటలు వాడిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మొహమ్మదాబాద్ గ్రామ రైతులు, మహిళలు, గ్రామస్తులు భజన కీర్తనలు చేస్తూ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నిండు కుండలతో గ్రామదేవతలకు జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి అన్ని రకాల పంటలు మంచి దిగుబడులు ఇవ్వాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని గ్రామస్తులు ప్రార్థించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శకుంతల బాలుసర్, భజన మండలి సభ్యుడు లక్షేటి శంకర్ మహారాజ్, గ్రామ పెద్దలు రాజా గౌడ్‌తో పాటు పలువురు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.