తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం…
నేటి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో విక్రయాలు
బియ్యం ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
14 రైతుబజార్లు, 30 రైస్ మిల్లుల్లో ప్రత్యేక విక్రయ కేంద్రాల ఏర్పాటు
కిలో బీపీటీ , కే ఎన్ ఎం స్టీమ్ రైస్ రూ.52కు.. రా రైస్ రూ.50కే అందుబాటులో
రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే అవకాశం..
ఆధార్, మొబైల్ నంబర్ తప్పనిసరి
(విజయవాడ, ఆంధ్రప్రభ) : బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించి వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం నుంచి ఎన్టీఆర్ జిల్లాలో తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభమవుతున్నాయి.
జిల్లాలోని 14 రైతుబజార్లు, 30 రైస్ మిల్లుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యాన్ని విక్రయించనున్నారు. ఈ పథకం కింద కిలో బీపీటీ, కేఎన్ఎం స్టీమ్ రైస్ ను రూ.52కు, రా రైస్‌ను కిలో రూ.50కు అందుబాటులో ఉంచారు. ఈ సదుపాయం రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు. బియ్యం కొనుగోలు చేసే సమయంలో ఆధార్ కార్డు, నమోదు చేసిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి కొరత తలెత్తకుండా తగిన బియ్యం నిల్వలు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా విక్రయాలు నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఇలక్కియా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యతో వినియోగదారులకు ఉపశమనం లభించడంతో పాటు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
