తల్లిపాలతోనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల గ్రామంలో శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నపోర్ల గ్రామ సర్పంచ్ గాండ్ల నికిత ప్రశాంత్ మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు ఉత్తమమైన ఆహారమని తెలిపారు. శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించడం వల్ల ఆరోగ్యంగా ఎదుగుతాడని పేర్కొన్నారు.

తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. తల్లిపాల ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎదుగుతాడని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ సుధారాణి, అంగన్వాడీ టీచర్లు సుజాత, అరుణ, విద్యావతి, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.