హనుమకొండ జిల్లాలో కలకలం..
కేజీబీవీ హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం
హనుమకొండ, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా శాయంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్‌లో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. 6, 7, 8వ తరగతులకు చెందిన విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలో హాస్టల్ ప్రహరీ గోడ దాటి బయటకు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం ప్రచారమైంది. ఉదయం హాస్టల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించే సమయంలో విద్యార్థినులు కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని ఘటనపై విచారణ ప్రారంభించారు. హాస్టల్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ, విద్యార్థినులు ఏ పరిస్థితుల్లో బయటకు వెళ్లారనే విషయాన్ని ఆరా తీశారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
హాస్టల్‌లో భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ విద్యార్థినులు ఎలా బయటకు వెళ్ళారనే అంశం చర్చనీయంశం అయ్యింది. భద్రతా వ్యవస్థలో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు. ముమ్మరంగా చేపట్టిన గాలింపు చర్యలు ఫలించాలని తెలుస్తోంది. పాఠశాల నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థినీల ఆచూకీ ఛేదించి విద్యార్థులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
