సీఎం దిష్టిబొమ్మ దహనానికి బీజేవైఎం యత్నం

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్

హనుమకొండ, ఆంధ్రప్రభ : హనుమకొండలోని అశోక్ జంక్షన్ సమీపంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు.

దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు.

ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల విడుదల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు.