ఉత్తరాంధ్ర ఇకపై ఉత్తమ ఉపాధి అవకాశాల కల్పన కేంద్రం: ప్రత్తిపాటి
- భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త ఊపు
- మెరైన్, ఐటీ, లాజిస్టిక్స్, పర్యాటక రంగాలకు కొత్త అవకాశాలు
- ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ప్రత్తిపాటి..
- అదితి విజయలక్ష్మి, కంభంపాటితో కలిసి సమీక్ష
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రాంతం, ఉత్తమ అవకాశాల కల్పన కేంద్రంగా మారబోతోందని, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ రాకతో ఇక్కడి ప్రజల జీవనవిధానంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని, భూముల ధరలకు రెక్కలొచ్చాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా రెండోరోజైన శుక్రవారం ప్రత్తిపాటి విజయనగరంలో పర్యటించారు.ప్రధాని మోదీ సభ, కార్యక్రమాల నిర్వహణ, జనసమీకరణ, భోజనం, ఇతర వసతుల కల్పనకు సంబంధించి, స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ఆయన కూటమి నాయకులకు దిశానిర్దేశం చేశారు.
అంతకుముందు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితోకలిసి పార్కింగ్ స్థలాల్ని పరిశీలించిన ప్రత్తిపాటి… అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు నివాసంలో జరిగిన కూటమి శ్రేణుల సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడారు.
ఎగతాళి చేసిన వారికి భోగాపురమే సమాధానం
ఎర్రబస్ రాని ఊరికి ఎయిర్ బస్ ఎందుకని ఎగతాళి చేసిన వాళ్ల నోళ్లు మూతపడేలా కూటమిప్రభుత్వం తన పనితీరుతో సమాధానం చెప్పిందని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఉత్తరాంధ్ర ప్రాంతం మెరైన్, ఐటీ/డేటా, లాజిస్టిక్స్, పర్యాటక రంగాల్లో అద్భుత ప్రగతిని కళ్లారా చూడబోతోందన్నారు. అభివృద్ధి అనే పదం పలకడానికి కూడా అర్హత లేని వారే, విజనరీ నాయకుడు చంద్రబాబు దార్శనికతను అవహేళన చేస్తుంటారని, కూటమి ప్రభుత్వ సారథి.. మాటలకందని చేతల నాయకుడని మరోసారి రుజువైందని ప్రత్తిపాటి స్సష్టం చేశారు.
ఎయిర్‌పోర్టు వెనుక అశోక్ గజపతిరాజు కృషి: ప్రత్తిపాటి
విజయనగరం ఎమ్మెల్యే నివాసంలో కూటమి శ్రేణులతో సమావేశం అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి, మాజీ ఎంపీ కంభంపాటి, స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతి రాజు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో అశోక్ గజపతిరాజు చేసిన కృషిని ప్రత్తిపాటి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు.
