పర్యాటక శాఖకు అజయ్ జైన్ విశిష్ట సేవలు
- పదవీ విరమణ సందర్భంగా ఏపీటీడీసీ ఘన సన్మానం
- సేవలను కొనియాడిన అధికారులు
విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఐఏఎస్ ప్రభుత్వ సేవల నుంచి పదవీ విరమణ చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పర్యాటక రంగ అభివృద్ధికి ఆయన అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు.
ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మేనేజింగ్ డైరెక్టర్ ఏ.ఏ.ఎల్. పద్మావతి కలిసి అజయ్ జైన్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం పర్యాటక శాఖ అధికారులు, ఉద్యోగులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ.. తన పదవీకాలంలో పర్యాటక శాఖ అభివృద్ధికి సహకరించిన అధికారులు, ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విధుల నిర్వహణలో ప్రతి ఒక్కరూ అందించిన సహకారం, అంకితభావం తనకు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ.. పర్యాటక శాఖ అభివృద్ధికి అజయ్ జైన్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
