మూడు నెలలుగా జీతాలు లేవ్
- ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించిన సిబ్బంది
- ఉద్యోగ భద్రత, పే స్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : గత మూడు నెలలుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వీబీ, జీఆర్ఎస్ సిబ్బందికి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎంపీడీఓ బి. శ్రీనివాస్, ఎంపీఓ రాములకు వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లప్పుడూ విధులు నిర్వహిస్తూ, సమయపాలన పాటిస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నప్పటికీ మూడు నెలలుగా జీతాలు అందడం లేదని వారు తెలిపారు. దీంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గతంలో ఉపాధి హామీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఉపాధి హామీ సిబ్బంది కోరారు.
