కృష్ణా జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
- ఆగస్టు 30 వరకు ఫారం-6, 7, 8 ద్వారా క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరణ
- అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రచురణ
- ముసాయిదా ఓటరు జాబితా వివరాలను వెల్లడించిన
- జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎం నవీన్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)–2026 కార్యక్రమంలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను శుక్రవారం ప్రచురించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎం నవీన్ కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముసాయిదా ఓటరు జాబితా వివరాలను వెల్లడించారు. ముసాయిదా జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే నిర్ణీత గడువులోగా క్లెయిమ్స్, అభ్యంతరాలు సమర్పించాలని ఆయన ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 5, 2026 నుంచి ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించి, జూన్ 15 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ చేపట్టారని తెలిపారు.

ముసాయిదా ఓటరు జాబితాలో మొత్తం 14,05,580 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 6,79,271 మంది పురుషులు, 7,26,266 మంది మహిళలు, 43 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో 537 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.
జూన్ 5 నాటికి జిల్లాలో మొత్తం 15,43,242 మంది ఓటర్లు ఉండగా, ఎన్యూమరేషన్ ప్రక్రియలో 1,37,662 ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి రాలేదని చెప్పారు. వీరిలో 56,346 మంది మరణించిన వారు, 34,650 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారు, 24,603 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, 21,970 మంది గైర్హాజరైన వారు, 93 మంది ఇతర కారణాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా ఓటరు జాబితా రూపొందించినట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గాల వారీగా గన్నవరంలో 2,55,178, గుడివాడలో 1,82,993, పెడనలో 1,58,667, మచిలీపట్నంలో 1,78,860, అవనిగడ్డలో 1,97,735, పామర్రులో 1,72,735, పెనమలూరులో 2,59,412 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో ఉన్నట్లు తెలిపారు.
ముసాయిదా ఓటరు జాబితాను సంబంధిత ఏఈఆర్వో కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలు, అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ముసాయిదా జాబితా సాఫ్ట్ కాపీలను అందజేసినట్లు చెప్పారు.
ఆగస్టు 30, 2026 వరకు ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఫారం-6, ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు ఫారం-7, పేరు, చిరునామా, పోలింగ్ కేంద్రం, ఇతర వివరాల్లో మార్పులు చేసుకోవడానికి ఫారం-8 ద్వారా సంబంధిత ఏఈఆర్వో, బీఎల్వో లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
ఆగస్టు 30 వరకు అందిన క్లెయిమ్స్, అభ్యంతరాలు, నో మ్యాపింగ్ కేసులు, ఇతర అనుమానాస్పద నమోదులను సెప్టెంబర్ 28, 2026లోగా పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం అన్ని సవరణలు పూర్తి చేసి అక్టోబర్ 3, 2026న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు.
ప్రతి ఓటరు తమ పేరు ముసాయిదా ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని, పొరపాట్లు ఉంటే లేదా కొత్తగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు.
రాజకీయ పార్టీలు, ప్రజలు, బూత్ లెవల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి తప్పులు, తేడాలు లేని నాణ్యమైన ఓటరు జాబితా రూపొందించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇంచార్జి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డిఆర్ఓ కే శ్రీధర్ రెడ్డి, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ పోతురాజు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
