పారదర్శకంగా పంట నష్టాల నివేదికలు
పారదర్శకంగా పంట నష్టాల నివేదికలు
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
అకాల వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నాం
క్షేత్రస్థాయిలోనే వ్యవసాయ, ఉద్యాన అధికారులు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ, విజయవాడ : అకాల వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని.. వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉన్నారని, వివిధ పంటలకు సంబంధించి పారదర్శకంగా పంట నష్టాలను అంచనా వేయడం జరుగుతోందని.. తుది నివేదికల ఆధారంగా పరిహారం అందుతుందని, అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
అకాల వర్షాలు వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలిగించిన నష్టంపై శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. అకాల వర్షాలు, గాలులు, వడగళ్లు వల్ల వివిధ పంటలకు జరిగిన నష్టాల వివరాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాలు, గాలుల వల్ల వరి, మొక్కజొన్నతో పాటు స్వల్పంగా జొన్న, మినుము పంటలకు నష్టం వాటిల్లిందని, అదేవిధంగా అరటి, బొప్పాయి పంటలు కూడా కొన్నిచోట్ల దెబ్బతిన్నాయన్నారు. తుది నివేదికల ఆధారంగా నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగావివిధ పంటలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చేసే సూచనలను అన్నదాతలు పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
