అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అమరావతి..

  • వేగంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం…
  • ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ..
  • ధ్యాన బుద్ధ, బుద్ధవనం, హరిత హోటల్‌పై ఏపీటీడీసీ చైర్మన్ ఆకస్మిక తనిఖీ
  • లేజర్ షో పునరుద్ధరణ.. వినియోగంలో లేని ఆస్తుల పునర్వినియోగానికి ఆదేశాలు
  • వెల్‌నెస్ సెంటర్, యోగా, బోటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలతో పర్యాటకానికి కొత్త ఊపు
  • ముఖ్యమంత్రి విజన్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అమరావతి

(విజయవాడ, ఆంధ్రప్రభ) : అమరావతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ శుక్రవారం ధ్యాన బుద్ధ విగ్రహం, బుద్ధవనం, హరిత హోటల్, బౌద్ధ పర్యాటక సర్క్యూట్ పరిధిలోని పర్యాటక ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీలించారు. పర్యాటకులకు అందుతున్న సేవలు, మౌలిక వసతులు, నిర్వహణ, వినియోగంలో లేని ఆస్తుల పరిస్థితిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

పర్యటన సందర్భంగా ధ్యాన బుద్ధ ప్రాంగణంలోని బుద్ధ మ్యూజియంను సందర్శించిన చైర్మన్, అమరావతి బౌద్ధ వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా నాటిన మొక్కను ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేసి సందర్శకులకు దాని చారిత్రక ప్రాధాన్యాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ధ్యాన బుద్ధ ప్రాజెక్టులో నిలిచిపోయిన లేజర్ షో పరికరాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి ప్రతిరోజూ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

బుద్ధవనం, పెద్దవనం ప్రాజెక్టుల పరిధిలోని భవనాలు, నూనెగుండం చెరువు, కాలచక్ర మ్యూజియం తదితర ప్రాంతాలను పరిశీలించిన ఆయన, వినియోగంలో లేని భవనాలను పునరుద్ధరించి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలు, అడవి చెట్లను తొలగించి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా అమరావతిని ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానంలో నిలిపేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

బుద్ధవనం ప్రాజెక్టులో అంతర్జాతీయ ప్రమాణాలతో వెల్‌నెస్ సెంటర్, యోగా, ధ్యాన కేంద్రాలు, ఆధ్యాత్మిక పర్యాటక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు పుష్కర ఘాట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం లేజర్ షో, సంగీత ప్రదర్శనలు, బోటింగ్, నదీతీర వినోద కార్యక్రమాలు, బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ఆకర్షణలను అభివృద్ధి చేస్తే అమరావతి దేశ, విదేశీ పర్యాటకులకు ప్రధాన గమ్యస్థానంగా అవతరిస్తుందని తెలిపారు. అమరావతి బౌద్ధ వారసత్వాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే అన్ని చర్యలను దశలవారీగా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.