రాప్తాడు నియోజకవర్గం ఓటర్ల జాబితా విడుదల..

రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎస్‌ఐఆర్–2026 ఓటర్ల జాబితాను నియోజకవర్గ ఎన్నికల అధికారి (ఆర్వో) వెంకటనారాయణ, తహసీల్దార్ చెన్నకేశవులు, మండల ఎన్నికల అధికారి సువర్ణ సంయుక్తంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆర్వో వెంకటనారాయణ మాట్లాడుతూ, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,24,554 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 1,12,185 మంది పురుషులు, 1,12,360 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.

ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో 28,321 మంది ఓటర్ల పేర్లను ఏఎస్‌డీ (Absent, Shifted, Dead) కేటగిరీ కింద తొలగించినట్లు తెలిపారు. వాటిలో ఇద్దరు ఆచూకీ తెలియని ఓటర్లు కూడా ఉన్నారని చెప్పారు.

ఓటర్ల జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌లు ఉంటే ఆగస్టు 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు.

ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌తో పాటు కలెక్టర్ కార్యాలయం, ఈఆర్వో కార్యాలయం, ఏఈఆర్వో కార్యాలయం, సంబంధిత బీఎల్‌వోల వద్ద కూడా పరిశీలించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారి సువర్ణ, ఎంపీడీవో విజయలక్ష్మి, మండల ఎన్నికల సహాయకుడు ప్రసాద్, బీఎల్‌వోలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.