కురుమ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం రేవంత్‌కు వినతి..

ఆలేరు, ఆంధ్రప్రభ : కురుమ సామాజిక వర్గం సంక్షేమం కోసం ప్రత్యేక కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు.

కురుమ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఆ సామాజిక వర్గం చాలా కాలంగా ఎదురుచూస్తోందని వారు ముఖ్యమంత్రికి వివరించారు. కార్పొరేషన్ ఏర్పాటుతో కురుమల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. వారి వినతిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కురుమల సంక్షేమం దృష్ట్యా ఆగస్టు 15లోపు కురుమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య, ఎగ్గే మల్లేశం ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.