చౌటుప్పల్‌లో ట్రామా కేర్ సెంటర్, 100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
వైద్యుల వృత్తి ఎంతో పవిత్రమైనది, బాధ్యతారాహిత్యం వద్దు
యాదాద్రి, నల్గొండ జిల్లాల వైద్యాధికారులతో మునుగోడు ఎమ్మెల్యే సమీక్ష
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మునుగోడు నియోజకవర్గంలో వైద్య రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల వైద్యాధికారులతో వైద్య శాఖ సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సబ్ సెంటర్లు, పిహెచ్‌సీలు, సిహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, నియామకం చేయాల్సిన సిబ్బంది, సాంకేతిక పరికరాలు, కావలసిన నిధులకు సంబంధించిన పూర్తి నివేదికలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రుల విస్తరణ – అభివృద్ధి ప్రతిపాదనలు
మునుగోడు, నాంపల్లి పీహెచ్సీలు : వీటికి ఆధునీకరణ పనులతో పాటు 30 పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయడం.
మర్రిగూడ సీహెచ్సీ : ప్రస్తుతం ఉన్న 30 పడకల సామర్థ్యాన్ని 50 పడకలకు పెంపు, అదనపు సిబ్బంది నియామకం, సాంకేతిక పరికరాలు, పోస్టుమార్టం ఎగ్జామిన్ రూమ్ ఏర్పాటు.
చండూరు: రెవిన్యూ డివిజన్ కేంద్రంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి మంజూరు, నిర్మాణ ప్రతిపాదనలు.
గట్టుప్పల్ పీహెచ్సీ: అవసరమైన సిబ్బంది నియామకం, సాంకేతిక పరికరాల కల్పనకు అంచనాలు రూపొందించడం.
జాతీయ రహదారిపై అత్యవసర వైద్యం – ట్రామా కేర్ సెంటర్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలలో బాధితులను గోల్డెన్ హవర్‌లో హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించలేక మార్గమధ్యలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎమ్మెల్యే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను నివారించడానికి చౌటుప్పల్ ప్రాంతంలో తక్షణమే ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో పాటు చౌటుప్పల్‌లోని 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఆధునిక పరికరాలతో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
”ప్రైవేట్ ఆస్పత్రుల్లో బిల్లులు కట్టలేక నిరుపేదలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కలచివేస్తున్నాయి. అందుకే ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.”
బడ్జెట్ పెంపునకు కృషి
పెరుగుతున్న ధరలు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా గ్రామాల్లో సబ్ సెంటర్లు, పిహెచ్‌సీలు, సిహెచ్‌సీల నిర్మాణాలకు ఇస్తున్న ప్రస్తుత బడ్జెట్ సరిపోవడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి బడ్జెట్ పెంపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
డాక్టర్లు కమిట్మెంట్‌తో పని చేయాలిఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు ఎంతో నిబద్ధతతో, కమిట్‌మెంట్‌తో పని చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ జిల్లా డిఎంహెచ్ఓ రాహుల్, డిసిహెచ్ మాతృనాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ మనోహర్, డిసిహెచ్ సూర్యశ్రీలతో పాటు మర్రిగూడ, చౌటుప్పల్, చండూరు, మునుగోడు, నాంపల్లి వైద్యాధికారులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
