Narendra Modi | సీసీఎస్‌లో కీలక నిర్ణయాలు
- పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ, ఎరువుల సరఫరాపై కేంద్రం భరోసా
- ప్రవాస భారతీయులు, నావికుల రక్షణకు ప్రత్యేక చర్యలకు ఆదేశాలు
- పునరుత్పాదక ఇంధనాల విస్తరణపై ప్రధాని ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ అంశంపై నిర్వహించిన ప్రత్యేక సీసీఎస్ సమావేశాల్లో ఇది నాలుగోది. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో సమీక్షించారు.
కేబినెట్ కార్యదర్శి ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులను సమావేశంలో వివరించారు. దేశంలో పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ వంటి పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఎరువుల సరఫరా అంతరాయం లేకుండా కొనసాగేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. ఎల్‌పీజీ కొనుగోలు వనరులను ఇప్పటికే విస్తరించామని, ప్రస్తుతం దేశంలో ప్రధాన పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు, సరఫరా తగిన స్థాయిలో ఉన్నాయని తెలిపారు.
తగిన ముడి చమురు లభ్యత వల్ల ప్రభుత్వ రంగ రిఫైనరీలు 100 శాతానికి మించిన సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, దీంతో పెట్రోలు, డీజిల్ తదితర ఉత్పత్తుల తయారీ నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు. పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్ల విస్తరణ, జాతీయ గ్యాస్ గ్రిడ్ అభివృద్ధి, ఎల్‌ఎన్‌జీ దిగుమతి సామర్థ్యాల పెంపు, నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్ విస్తరణ వంటి చర్యలతో ఎల్‌పీజీపై ఆధారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు.
రాబోయే రబీ సీజన్‌కు అవసరమైన ఎరువుల లభ్యతపై కూడా సమావేశంలో సమీక్ష జరిగింది. అవసరమైతే ప్రత్యామ్నాయ దిగుమతి వనరులను వినియోగించాలని, రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు.
నావికుల కోసం ప్రత్యేక సహాయ వ్యవస్థ..
యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో దేశీయ, విదేశీ జెండా నౌకల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల పరిస్థితిపై కూడా సమావేశంలో చర్చించారు. వారికి, వారి కుటుంబాలకు అవసరమైన సమాచారం, అత్యవసర సహాయం, మానసిక సలహా అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని సూచించారు.
వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం భారత పౌరులు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వారి భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి
దేశ ఇంధన స్వావలంబన కోసం సౌరశక్తితో పాటు ఇతర శిలాజేతర ఇంధన వనరుల వినియోగాన్ని మరింత విస్తరించాలని ప్రధాని సూచించారు. పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెంచడం ద్వారా భవిష్యత్తులో ఇంధన భద్రతను బలోపేతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
వెస్ట్ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం ఒకే సమన్వయంతో పనిచేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలను వేగంగా అమలు చేసేలా సమగ్ర సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దేశ పౌరుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
