టీటీడీ దర్శనం టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం.. నిందితుడిపై కేసు నమోదు

గురజాల, ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దర్శనం టికెట్లు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిపై గురజాల పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తులు టీటీడీ దర్శనం టికెట్లు, ప్రభుత్వ సేవలు లేదా ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి నగదు చెల్లించే ముందు పూర్తి వివరాలు నిర్ధారించుకోవాలని, మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

గురజాల సీఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం, గురజాలకు చెందిన వంకాయల ఆంజనేయులు కుమారుడు అక్షయ్ కుమార్ టీటీడీ శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది. అయితే టికెట్లు ఇప్పించకుండా తప్పుడు హామీలు ఇస్తూ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించామని, కేసులో నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు.