అందరికీ పదవులు వస్తాయ్
ఆ దిశగానే చంద్రబాబు అడుగులు
మంత్రి నారా లోకేష్
అమరావతి, ఆంధ్రప్రభ : బలహీనవర్గాలకు ఎమ్మెల్సీలుగా ప్రాధాన్యం కల్పించి తెలుగుదేశం పార్టీ వారి పట్ల ఉన్న చిత్తశుద్ధిని మరోమారు చాటుకుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇవాళ విలేకరులతో చిట్ చాట్ చేశారు. శాసనమండలిలో గొంతెత్తే యువ మహిళలను ప్రోత్సహించేందుకు గ్రీష్మకు అవకాశం కల్పించామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ పట్ల బీదా రవిచంద్ర, బీటీ నాయుడులు చూపిన విధేయత అందరికీ తెలిసిందేనన్నారు. దశల వారీగా కష్టపడిన అందరికీ పదవులు వస్తాయని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. బీద రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. లోకేష్‌ను మర్యాద పూర్వకంగా బీద రవిచంద్ర కలిశారు. ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని లోకేష్ కోరారు.
ఒక్కొక్క సమస్య పరిష్కరిస్తున్నాం..
కాగా, ఉపాధ్యాయుల సమస్యలను ఓ క్రమపద్ధతిలో పరిష్కరించామని వెల్లడించారు. అంగన్వాడీలకు సంబంధించిన నాలుగు సమస్యలు పరిష్కరించామని అన్నారు. ఈ నెల 19వ తేదీన మల్లవల్లిలో జరిగే అశోక్ లైల్యాండ్ ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటున్నానని తెలిపారు. ఏపీకి పెట్టుబడులు ఓ క్రమపద్ధతిలో ఒక్కొక్కటిగా తెస్తున్నామని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టినవాళ్లకు ఇవ్వాల్సిన రాయితీల్లో 50శాతం వాటా అడిగారని కొందరు పారిశ్రామికవేత్తలు తమ దృష్టికి తెస్తున్నారన్నారు. ఏపీలో ఇక అలాంటి పరిస్థితులు ఉండబోవని, వారికి హామీ ఇచ్చి ఒప్పిస్తున్నామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను జగన్ ప్రభుత్వం రూ.4500కోట్లు పెట్టి దిగిపోయిందని ఆరోపించారు. చిక్కీ, గుడ్డు, స్కూల్ కిట్స్‌లో రివర్స్ టెండరింగ్ లేకుండా రూ.1000 కోట్లను తమ ప్రభుత్వం ఆదా చేసిందని తెలిపారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లోనూ నాణ్యత పెంచామని మంత్రి స్పష్టం చేశారు.