రాజీవ్ రహదారిపై వరద నీరు

పైపులు తొలగించి నీటి ప్రవాహానికి మార్గం

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి సాయిగార్డెన్ సమీపంలో రాజీవ్ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో మున్సిపల్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కమిషనర్ ఆకుల వెంకటేష్ గురువారం ఘటనాస్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పైపులను క్రేన్ సహాయంతో తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించి ట్రాఫిక్‌ను నియంత్రించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య మాట్లాడుతూ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

మున్సిపల్ యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు పూదరి అనూష మహేందర్, అక్కపల్లి సుజాత క్రాంతి, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, జూనియర్ అసిస్టెంట్ సురేందర్, వార్డు అధికారులు, నాయకుడు వునుకొండ రాకేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.