పేదలు, అనాథలకు భోజనం, దుప్పట్లు పంపిణీ..
మైలవరం, ఆంధ్రప్రభ : జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నార్త్ సౌత్ ఫౌండేషన్ ఉపకారవేతనాలు పొందిన విద్యార్థులు మానవత్వాన్ని చాటుతూ సేవా కార్యక్రమం నిర్వహించారు. మైలవరం గ్రామంలోని రోడ్ల వెంట నివసిస్తున్న చిన్నారుల తల్లులు, అనాధలు, వృద్ధులు, యాచకులకు భోజన ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.
స్థానిక లకిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో, మైలవరం ఓల్డ్ స్టూడెంట్స్ ట్రస్ట్ సహకారంతో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నార్త్ సౌత్ ఫౌండేషన్ స్కాలర్షిప్ కోఆర్డినేటర్ గూడూరు నాగిరెడ్డి తెలిపారు.
భోజన ప్యాకెట్లను ఇస్కాన్ అక్షయ పాత్ర సంస్థ అందించిందని ఆయన వెల్లడించారు. వర్షం కురుస్తున్నప్పటికీ పేదల గుడిసెల వద్దకు స్వయంగా వెళ్లి భోజనం, మంచినీరు, దుప్పట్లు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. నార్త్ సౌత్ ఫౌండేషన్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం మార్గదర్శకాల మేరకు ఉపకారవేతనాల పునరుద్ధరణ పొందే విద్యార్థులు సంవత్సరానికి కనీసం 50 గంటలకు పైగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుందని వివరించారు.
ఈ ఏడాది ఉపకారవేతనాల పునరుద్ధరణలో భాగంగా ఎన్ఎస్ఎస్ యూనిట్, ప్రకృతి క్లబ్ ఆధ్వర్యంలో మోస్ట్ సహకారంతో ఇప్పటికే ఆరు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, అవకాశం మేరకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని గూడూరు నాగిరెడ్డి తెలిపారు.
ఉపకారవేతనాలు పొందిన విద్యార్థులు విద్యలో రాణించడమే కాకుండా సమాజానికి తమవంతు సేవ అందించాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. శివహరి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఓల్డ్ స్టూడెంట్స్ ట్రస్ట్ సభ్యులు, నార్త్ సౌత్ ఫౌండేషన్ స్కాలర్షిప్ కోఆర్డినేటర్ గూడూరు నాగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. శివహరి ప్రసాద్, అలాగే నార్త్ సౌత్ ఫౌండేషన్ ఉపకారవేతనాలు పొందిన విద్యార్థులు పాల్గొన్నారు.
