బెల్లంపల్లి డివిజన్‌లో భారీ వర్ష బీభత్సం

పొంగిపొర్లుతున్న వాగులు..

నిలిచిన రాకపోకలు..

వరద పరిస్థితిని పరిశీలించిన అధికారులు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు గురువారం కూడా కుండపోతగా కొనసాగడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.

బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెరువులు, కుంటలు నిండిపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాత జీమాపిస్తా నుంచి కాంట్రా చౌరస్తా వరకు ఉన్న ప్రధాన రహదారి వరద నీటితో నిండిపోయింది.

రాంనగర్ వాగు ప్రవాహాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్, సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ ఎల్. కృష్ణ, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కన్నెపల్లి మండలంలోని ఎర్రవాగు, నల్లవాగు, తాండూర్ మండలంలోని మాదారం, త్రీ ఇంక్లైన్, నర్సాపూర్, బెజ్జాల అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో లోలెవల్ వంతెనలపై భారీగా నీరు ప్రవహించింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

భీమిని మండలంలోని రాజారం పెద్దవాగు, చింతపూడి లింగాల వాగు, వేమనపల్లి మండలంలోని నీల్వాయి వాగు ఉధృతంగా ప్రవహించాయి. నీల్వాయి–మామడ ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

బెల్లంపల్లి పట్టణంలోని జాతికుంట చెరువు పూర్తిగా నిండిపోవడంతో సమీప ఇళ్లలోకి వరద నీరు చేరే ప్రమాదం ఏర్పడింది. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్, కౌన్సిలర్ కంకటి ప్రణీత, మాజీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ పరిశీలించి నీటిని మరోవైపు మళ్లించారు.

బెల్లంపల్లి మండలం చర్లపల్లి ప్రధాన రహదారిపై ఉన్న కాజ్‌వే, నెన్నెల మండలంలోని నార్వాయిపేట–ఆకెనపల్లి మధ్య పాలవాగు, కాసిపేట మండలంలోని పెద్దనపల్లి వాగు, సల్పలవాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

దేవాపూర్ గ్రామంలో సయ్యద్ సరోజనకు చెందిన పెంకుటిల్లు భారీ వర్షానికి కూలిపోయింది. ఘటన స్థలాన్ని ఎస్సై అరికిల్ల గంగారం పరిశీలించి బాధిత మహిళను సురక్షిత ప్రాంతానికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.

పలు ప్రాంతాల్లో పంట పొలాలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలో కొన్ని నివాస గృహాలు కూడా వర్షాలకు దెబ్బతిన్నాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చోట్ల బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అధికారుల పరిశీలన

బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్ హనోక్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, మాదారం ఎస్సై సౌజన్య, వేమనపల్లి ఎస్సై కె. జగదీశ్వర్ రెడ్డి, కాసిపేట ఎస్సై ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్లు చింతల వసంత, బేతి శ్రావణ్, కొక్కుల రాంమూర్తి తదితరులు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

కన్నెపల్లిలో అడిషనల్ కలెక్టర్ తనిఖీ

కన్నెపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ వడాల రాములు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా భూభారతి, రెవెన్యూ రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు.

ఆన్‌లైన్ పెండింగ్ దరఖాస్తులు, కల్యాణలక్ష్మి, విద్యార్థుల ధ్రువపత్రాల జారీ ప్రక్రియను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.