వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి
నిర్లక్ష్యంపై చర్యలు తప్పవు: డీఎంహెచ్ఓ డాక్టర్ వై. పవిత్ర
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది అందించే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ వ్యాధుల నివారణకు సహకరించాలని ఆమె కోరారు.
పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఈగలు, దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈగల ద్వారా కలరా, టైఫాయిడ్, రక్త విరేచనాలు, నీళ్ల విరేచనాలు వంటి వ్యాధులు, దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, ఫైలేరియా, మెదడువాపు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలిపారు.
జ్వరం, విరేచనాలు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలని సూచించారు.
ప్రజలు తప్పనిసరిగా మరిగించి చల్లార్చిన నీటినే తాగాలని, తాజాగా వండిన వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని తెలిపారు. వర్షాల సమయంలో పిల్లలు, వృద్ధులు అనవసర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త పడాలని, గర్భిణులు ముందస్తుగా ప్రభుత్వ వైద్యశాలలను సంప్రదించి సురక్షిత ప్రసవానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ వై. పవిత్ర ఆదేశించారు. ఆశా కార్యకర్తల నుంచి వైద్యాధికారుల వరకు అందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ప్రస్తుతం సాధారణ సెలవులు మంజూరు చేయడం లేదని స్పష్టం చేసిన ఆమె, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై సీసీఏ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
