Komuravelli Railway Station | కొమురవెల్లికి రైలు రాక
Komuravelli Railway Station |
కొమురవెల్లికి రైలు రాక
Komuravelli Railway Station |మల్లన్న భక్తులకు రైలు వరం
రూ.5.63 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ నిర్మాణం.. 99 శాతం పనులు పూర్తి
Komuravelli Railway Station | ఉమ్మడి మెదక్ బ్యూరో, (ఆంధ్రప్రభ): తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల చిరకాల కోరిక త్వరలో నెరవేరనుంది. ఇప్పటివరకు రోడ్డు మార్గాలపై ఆధారపడిన భక్తులకు ఇకపై రైలు మార్గం ద్వారా సులభంగా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5.63 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న కొమురవెల్లి పుణ్యక్షేత్ర రైల్వే స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 99 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఈ స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆ దిశగా తెలంగాణలోని కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి రైల్వే అనుసంధానం కల్పించడం కీలక అడుగుగా భావిస్తున్నారు.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రానికి నేరుగా చేరుకునే సౌకర్యం ఏర్పడటంతో భక్తుల కష్టాలు గణనీయంగా తగ్గనున్నాయి. రైల్వే స్టేషన్ ప్రారంభం కావడంతో ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి కొత్త ఊపు రానుంది.
స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం
కొమురవెల్లి రైల్వే స్టేషన్ కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాదు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. భక్తుల రాకపోకలు అధికం కావడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మౌలిక వసతులు, రోడ్లు, రవాణా, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఈ రైల్వే స్టేషన్ ఎంతో ఉపయోగకరంగా మారనుందని తెలిపారు. స్టేషన్ ప్రారంభంతో భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధి, స్థానిక ఉపాధి, పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ భక్తుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతోందని వివరించారు.

కొమురవెల్లి స్టేషన్‌లో ప్రధాన వసతులు
- ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారంతో స్టేషన్ భవనం
- 553 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో హై లెవల్ ప్లాట్‌ఫామ్
- విశాలమైన వెయిటింగ్ హాల్
- టికెట్ బుకింగ్ కౌంటర్లు
- పార్కింగ్ సౌకర్యం
- తాగునీటి వసతి
- మహిళలు, పురుషులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు
- స్థానిక సంస్కృతి, మల్లన్న స్వామి వైభవాన్ని ప్రతిబింబించే కళాత్మక నిర్మాణం
- ప్రకృతి సంపద, స్థానిక వారసత్వాన్ని చాటిచెప్పే గోడ చిత్రాలు
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమైతే అది కేవలం ఒక స్టేషన్ ప్రారంభం మాత్రమే కాకుండా, తెలంగాణ ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి కొత్త అధ్యాయంగా నిలుస్తుందని భక్తులు, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
