నంద్యాలను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రలో తీవ్రమైన ఎల్ నినో ప్రభావంతో కరువు కోరల్లో చిక్కుకున్న నంద్యాల జిల్లా రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు అవగాహన కార్యక్రమాలు, ఉపశమన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, గడివేముల, మిడుతూరు, కొత్తపల్లి, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు అల్లాడిపోతున్నారన్నారు. వర్షాభావం దృష్ట్యా ఖరీఫ్ సీజన్ గడువును సెప్టెంబర్ ఆఖరు వరకు పొడిగించాలని కోరారు.

ఉమ్మడి జిల్లా పరిధిలోనే పంటల బీమా ప్రీమియంలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో పంటల బీమా ప్రీమియం ఎకరాకు రూ. 44 గా ఉంటే, నంద్యాల జిల్లాలో మాత్రం ఎకరాకు రూ. 450 కట్టాలని అధికారులు చెప్పడం ఏంటని నిలదీశారు. ఈ తారతమ్యాలను వెంటనే సరిదిద్దాలన్నారు. ఉపాధి లేక నలిగిపోతున్న వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలని, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటలకు, తాగునీటికి ఆధారమైన అలగనూరు రిజర్వాయర్ గండిని 2017లో పరిశీలించి రూ. 31 కోట్లతో అంచనాలు వేశారని, ప్రస్తుత కలెక్టర్ పరిశీలించి రెండేళ్లు కావస్తున్నా ఆ గండిని పూడ్చకపోవడం దారుణమన్నారు. డోన్ ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా చెరువులు నింపుతామని, రూ. 382 కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్ట్ చేపడతామని చెప్పిన ప్రభుత్వం నేటికీ ఆ పనులను నెరవేర్చకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నారన్నారు.

బనగానపల్లె నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీల కోసం, అల్ట్రాటెక్, పవర్ గ్రిడ్ కంపెనీల పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలను బలవంతంగా సేకరించి తగిన నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. పాణ్యం, గడివేముల మండలాల్లో గ్రీన్ కో ప్రాజెక్టు కింద వేలాది ఎకరాలు లాక్కుని, స్థానిక నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో పేదల భూములను అభివృద్ధి పేరిట లాక్కున్నారని విమర్శించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సిపిఐ ఆధ్వర్యంలో సమరభేరి మోగిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సిపిఐ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె.ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి సోమన్న, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.