పేద పిల్లల భోజనంలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు..

ఫుడ్ కమిషన్ చైర్మన్ హెచ్చరిక

లంచాలకు పాల్పడితే సస్పెన్షన్, ఫైన్లు తప్పవని స్పష్టం.. నందికొట్కూరులో ఆకస్మిక తనిఖీలు

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: పేద పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న భోజనం, పోషకాహారంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పగిడ్యాల మండలం లక్ష్మాపురం అంబేద్కర్ గురుకులంతో పాటు నందికొట్కూరులోని వివిధ హాస్టళ్లు, కోట హైస్కూల్, సీఎస్ఐ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఆహార నిల్వలు, వసతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద పిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారం అందిస్తున్నాయని, అందులోనూ అక్రమాలకు పాల్పడే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. నాసిరకం ఆహారం అందించడం, ఆహార పదార్థాలను దుర్వినియోగం చేయడం, లంచాలకు పాల్పడడం వంటి ఘటనలు వెలుగుచూస్తే శాఖాపరమైన చర్యలతో పాటు సస్పెన్షన్, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

హాస్టళ్లలో అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థుల నుంచే ఫిర్యాదులు వచ్చాయని, ముఖ్యంగా ఉప్మా నాణ్యతపై అసంతృప్తి వ్యక్తమైందన్నారు. వెంటనే మెనూను మెరుగుపర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అవసరానికి మించి బియ్యం నిల్వ చేయడం వల్ల పురుగు పట్టిన ఘటనలను ప్రస్తావిస్తూ, అవసరానికి అనుగుణంగానే నిల్వ ఉంచాలని సూచించారు. గురుకులాల్లో వంట సిబ్బంది వేతనాల కోత, ఫేస్ యాప్ సెలవుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రేషన్ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం, పీఎం మాతృ వందన యోజన తదితర కార్యక్రమాలు ఫుడ్ కమిషన్ పరిధిలోనే ఉంటాయని పేర్కొన్నారు. ఆహార సరఫరాలో లోపాలు, అక్రమాలు జరిగినట్లు తేలితే సుమోటోగా కేసులు నమోదు చేయడం, భారీ జరిమానాలు విధించడం, సస్పెన్షన్‌కు సిఫారసు చేసే అధికారాలు కమిషన్‌కు ఉన్నాయని స్పష్టం చేశారు.

ప్రతి మండల స్థాయి అధికారి వారానికి కనీసం రెండుసార్లు తన పరిధిలోని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలను తనిఖీ చేసి లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు. అలాగే నందికొట్కూరు పరిధిలోని ఇద్దరు ఎంఈఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇన్‌స్పెక్టర్ వెంకటరాముడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.