రెండు రోజుల ముందుగా సామాజిక పింఛన్లు పంపిణీ
- కూటమి ప్రభుత్వంలో శరవేగంగా రాష్ట్ర అభివృద్ధి
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి (శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : ఆగస్టు 1న ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన అల్లూరి సీతారామరాజు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని భారత ప్రధాని ప్రారంభించనున్న సందర్భంగా పండుగ వాతావరణం నెలకొన్నందున వృద్ధులు, వికలాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సామాజిక పింఛన్లను రెండు రోజుల ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
గురువారం కోటబొమ్మాళి మండలం కన్నెవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. అనంతరం జాతీయ రహదారి నుంచి కన్నెవలస గ్రామం వరకు, అలాగే గ్రామంలోని అంతర్గత సీసీ రహదారులను రూ.88 లక్షల వ్యయంతో నిర్మించిన పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పింఛన్ లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి, ప్రతి నెలా పారదర్శకంగా ఇంటి వద్దకే పింఛన్ అందుతున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన విమానాశ్రయం సాకారం కావడం ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందన్నారు. ఉపాధి అవకాశాల లేమితో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం పరిశ్రమలను తీసుకొస్తోందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు విశేష ప్రాధాన్యం ఇచ్చిందని, రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపనలు జరిగాయని పేర్కొన్నారు. విశాఖపట్నం త్వరలోనే ఉద్యోగ అవకాశాలకు కేంద్రబిందువుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల సహకారంతో గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.
నేరడీ బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, దాని కోసం సుమారు రూ.641 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. బ్యారేజ్ పూర్తయితే రైతులకు నిరంతర సాగునీరు అందడంతో జిల్లా సస్యశ్యామలం అవుతుందని, 2029 నాటికి గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచి రూపురేఖలు మార్చుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్, ఆర్డీఓ ఎం. కృష్ణమూర్తి, రాజ్ ఇంజినీరింగ్ అధికారి ఎం. సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
