యువకుల మృతదేహాలు లభ్యం..

  • జోరు వానలో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు
  • మూడో రోజు దొరికిన బాబాయ్‌, కొడుకుల మృతదేహాలు

చింతూరు/ మోతుగూడెం, ఆంధ్రప్రభ : పోలవరం జిల్లా చింతూరు మండలం చింతూరు – రాజమండ్రి ఘాట్‌ రోడ్డులోని తులసిపాక గ్రామానికి సుమారు 5 కిలో మీటర్ల దూరంలో గల సోకిలేరు వ్యూ పాయింట్‌ వద్ద సోకిలేరు వాగులో పశ్చమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన పెండెం కళ్యాణ్‌ (25), పెండెం బాబీ (21)లు మంగళవారం గల్లంతైయ్యారు.

ఈ ఇద్దరుతో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలసి సోకిలేరు వ్యూ పాయింట్‌ దగ్గరకి విహారయాత్రకు వచ్చి ప్రక్కనే ఉన్న సోకిలేరు వాగులో దిగారు. ఈ క్రమంలో పెండెం బాబీ (21) కాలు జారీ నీటిలో పడ్డాడు, తన బాబాయి పెండెం కళ్యాణ్‌ (25) కొడుకు వరసయ్యే బాబీని కాపాడే ప్రయత్నంలో అతను సైతం కొట్టుకుపోయి గల్లంతైయ్యారు.

జోరు వానలో గాలింపు..

ఈ సమాచారం అందుకున్న చింతూరు సీఐ గోపాల క్రిష్ణ, మోతుగూడెం ఎస్సైలు నషీర్‌ హుస్సెన్‌, క్రిష్ణలు తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులుగా గల్లంతైన యువకుల కోసం జోరు వానలో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు విస్కృతంగా గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం మృతదేహాలు లభించాయి.