భారీ వర్షాలకు పెద్దపల్లి జలమయం

కుంటలను తలపించిన కాలనీలు.. రోడ్లపై ప్రవహించిన వరద నీరు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా కేంద్రం జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పలు కాలనీలు కుంటలను తలపించగా, డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దీంతో పలుచోట్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తక్కువ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు రోడ్లపైనే ప్రవహించింది. గత రెండు నెలలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఆందోళన చెందిన రైతులకు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. పంటలకు అవసరమైన తేమ లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.