వర్షంలోనూ విద్యుత్ సేవలకు అంకితభావం

టేకుమట్ల, ఆంధ్రప్రభ: భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నప్పటికీ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా విద్యుత్ లోపాలను గుర్తించి, అత్యవసర మరమ్మతులు చేపట్టి సరఫరా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు.

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో మండల విద్యుత్ అధికారి మణిదీప్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ లైన్మెన్ రాజేష్ వర్షంలోనే విద్యుత్ లోపాలను గుర్తించి మరమ్మతులు చేపట్టారు. ఆయన నిరంతర శ్రమతో విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తుండటం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.