గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులతో రాయలసీమకు కొత్త వెలుగు
కర్నూలు, అనంతపురంలో 800 మెగావాట్ల సోలార్-విండ్ ప్రాజెక్టులకు శ్రీకారం
4 వేల మందికి ఉపాధి.. పరిశ్రమలకు గ్రీన్ పవర్ అందించడమే లక్ష్యం
కర్నూలు రూరల్, ఆంధ్రప్రభ బ్యూరో: రాయలసీమను దేశంలోనే ప్రముఖ పునరుత్పాదక ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు పడింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రూ.5,350 కోట్ల పెట్టుబడితో 800 మెగావాట్ల సామర్థ్యంతో టాటా పవర్ సోలార్-విండ్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 అమలులో భాగంగా రాయలసీమను రెన్యువబుల్ ఎనర్జీ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా భారీ ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తున్నాయి.
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా గురువారం పత్తికొండలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుంది.
టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టీపీఆర్ఈఎల్) ఆధ్వర్యంలో భారీ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుల్లో కర్నూలు జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ ప్లాంట్, అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు నిర్మించనున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో 2,700 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,250 కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుండగా, అనంతపురం జిల్లా కనేకల్లు మండలంలో 760 ఎకరాల్లో రూ.3,500 కోట్లతో విండ్ పవర్ ప్రాజెక్టు నిర్మించనున్నారు. కనేకల్లు విండ్ ప్రాజెక్టును సుజలాన్ సంస్థ సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేయనున్నారు.
ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ దశలో సుమారు 4 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత నిర్వహణ, భద్రత, రవాణా, నిర్వహణ సేవలు, అనుబంధ రంగాల్లో మరిన్ని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 1,100కు పైగా వ్యవసాయ కుటుంబాలు ఈ ప్రాజెక్టుల ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు పొందనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
పరిశ్రమలకు గ్రీన్ పవర్
రాష్ట్రానికి ఇటీవల భారీస్థాయిలో వస్తున్న డేటా సెంటర్లు, బ్యాటరీ తయారీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగ పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. ఈ నేపథ్యంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచి పరిశ్రమలకు నాణ్యమైన గ్రీన్ ఎనర్జీ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. యుటిలిటీలు, డిస్కమ్‌లు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల అవసరాలకు ఈ ప్రాజెక్టులు విద్యుత్‌ను అందించనున్నాయి. తద్వారా పరిశ్రమల నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణహిత విద్యుత్ వినియోగం కూడా పెరగనుంది.
రాయలసీమకు గుర్తింపు
గత రెండేళ్లలో రాయలసీమలో రెన్యూపవర్, ఎస్ఏఈఎల్ మెగా సోలార్ ప్రాజెక్టులతో పాటు గ్రీన్ ఎనర్జీ, సోలార్ పరికరాల తయారీ, బ్యాటరీ పరిశ్రమలు వరుసగా రావడం ప్రారంభమైంది. ఇప్పుడు టాటా పవర్ వంటి దేశంలోని ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టడం వల్ల రాయలసీమ దేశంలోని ప్రముఖ క్లీన్ ఎనర్జీ కారిడార్‌గా అవతరించే అవకాశాలు మరింత బలపడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యానికి ఈ ప్రాజెక్టులు కీలకంగా నిలవనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
