కొట్టుకుపోయిన కల్వర్టు.. నిలిచిన రాకపోకలు
వికారాబాద్, ఆంధ్రప్రభ: బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మదుగుల్ చిట్టెంపల్లి వద్ద ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోయి వికారాబాద్–పరిగి ప్రధాన మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కల్వర్టు దెబ్బతినడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి పలు మండలాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. మరోవైపు ఈ వర్షాలు పంటలకు ఎంతో ఉపయోగకరంగా మారడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అవసరమైన తేమ అందడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే తరహాలో మరోసారి వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు మరింత పెరుగుతాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
