భారీ వర్షాలు.. జిల్లాలోని పాఠశాలలకు నేడు సెలవు
నిర్మల్, ఆంధ్రప్రభ: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భారీ వర్షాల కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువులు, నీటి ప్రవాహాలు అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు సమాచారం అందించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
