భారీ వర్షాలు.. ఉమ్మడి ఆదిలాబాద్లో హై అలర్ట్
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ల హెచ్చరిక
సీజనల్ వ్యాధులు, వరదలపై అప్రమత్తత పాటించాలని సూచన
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు సూచించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై గురువారం అధికారులు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలు, కల్వర్టులు, వంతెనల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ఉప్పొంగే అవకాశం ఉన్నందున వరద నీటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు కూడా భారీ వర్షాల సమయంలో పొలాల్లో వ్యవసాయ పనులకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, బలహీనంగా ఉన్న చెట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులు లేదా సంబంధిత శాఖలకు సమాచారం అందించాలని కోరారు. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, అన్ని శాఖల అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉంటూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాల కారణంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. తాగునీటిని తప్పనిసరిగా కాచి చల్లార్చిన తర్వాత లేదా శుద్ధి చేసి మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పూల కుండీలు, ఎయిర్ కూలర్లు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు వంటి నీరు నిలిచే వస్తువులను తరచూ శుభ్రం చేసి దోమలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని లేదా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కలెక్టర్ కోరారు. వైద్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైన మందులు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ రాజార్షి షా వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే వెంటనే సహాయ చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

