ఎల్కతుర్తిలో రూ.13 కోట్ల బీటీ రోడ్డు పనులకు ప్రారంభం

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండలం అభివృద్ధి దిశగా ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుండి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.13 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామాలకు మండల కేంద్రానికి రవాణా అనుసంధానం మెరుగుపడుతుందని తెలిపారు. ఎల్కతుర్తి మండల కేంద్రానికి కోర్టు, విద్యుత్ ఉపకేంద్రం, తహసీల్దార్ కార్యాలయాలు వస్తున్నాయని, దీంతో ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. ఈ రహదారి నిర్మాణ విషయాన్ని కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ, రహదారి అభివృద్ధితో గ్రామాల కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, కుడా సీపీవో అజిత్ రెడ్డికి శాలువాలతో సన్మానం చేశారు.

అనంతరం ఎల్కతుర్తి నుండి దామెర వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి, కలెక్టర్ అధికారులు కలిసి పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు..

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి సర్పంచ్ లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, ఉప సర్పంచ్ రాజు, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, తహసిల్దార్ ప్రసాదరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.