తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు ఊరట

  • పర్యావరణ అనుమతులకు గ్రీన్ సిగ్నల్..
  • సీతమ్మ సాగర్‌కు లైన్ క్లియర్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ముఖ్యంగా సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి, 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. అలాగే 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా.. రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంబంధిత అధికారులకు మంత్రి తుమ్మల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు ఊరట

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం 2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన కార్యనిర్వాహక మెమోరాండంను రద్దు చేసినప్పటికీ, ఆ మెమోరాండం ఆధారంగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి వంటి నిర్మాణ దశలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లయింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆఫీస్ మెమోరాండంలు లేదా కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను సవరించడం లేదా భర్తీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే భవిష్యత్తులో ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులకు మినహాయింపులు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.

ఈ తీర్పుతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట తదితర జిల్లాల రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. పర్యావరణ అనుమతుల వివాదం తొలగడంతో ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగవంతమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.