తహశీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు.. ఏసీబీ సోదాల్లో కోట్ల సంపద వెలుగులోకి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండ్ అయిన శామీర్‌పేట మాజీ తహశీల్దార్ సుచరిత నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ల ప్రకారం గుర్తించిన ఆస్తుల విలువ రూ.5.5 కోట్లకు పైగా ఉండగా, మార్కెట్ విలువ దీని కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

స్థానిక రైతులకు చెందిన 30 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేయ‌డంతో.. బాధితులు మే 26న ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అధికారులు ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం, తొలి విడతగా రూ.2 లక్షలు ప్రైవేట్ డ్రైవర్ ద్వారా స్వీకరిస్తుండగా పట్టుకుని సుచరితపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తాజాగా నిర్వహించిన సోదాల్లో సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం దామరకుంట గ్రామంలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో మూడు ఫ్లాట్లు, కీసర, ఖానామెట్ ప్రాంతాల్లో రెండు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే రూ.12 లక్షల నగదు, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.38 లక్షల నిల్వలు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇవేకాకుండా ఒక వోక్స్‌వ్యాగన్ కారు, ఒక హ్యుందాయ్ క్రెటా కారు, వాటికి సంబంధించిన పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నామని, మరికొన్ని అదనపు ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.