Gachibowli Theft |నేపాలీ దంపతులపై పోలీసుల అనుమానం

Gachibowli Theft | నేపాలీ దంపతులపై పోలీసుల అనుమానం

Gachibowli Theft | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఓ వ్యాపారి ఇంట్లో సుమారు కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

ఇటీవల వ్యాపారి కుటుంబ సభ్యులు ముంబయికి వెళ్లగా, తిరిగి ఇంటికి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇంట్లో నెల రోజుల క్రితమే పనిలో చేరిన నేపాలీ దంపతులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం వారు కనిపించకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ, నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇటీవల నగరంలో గృహ సహాయకులు, కేర్‌టేకర్ల ప్రమేయంతో జరుగుతున్న చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి భద్రతా అంశాలపై చర్చకు దారి తీసింది.

Leave a Reply