పులుల సంరక్షణలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు రాష్ట్ర స్థాయి గౌరవం
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా 14 మంది అటవీ అధికారులు, సిబ్బందికి ప్రతిభా పురస్కారాలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ: ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)కు మరో అరుదైన గౌరవం లభించింది. పులుల సంరక్షణ, అటవీ రక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, అక్రమ వేట నిరోధం, వన్యప్రాణుల సంరక్షణలో విశిష్ట సేవలు అందించిన నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ శాఖకు చెందిన 14 మంది అధికారులు, సిబ్బంది రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ పులుల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్) వినయ్ కుమార్ సమక్షంలో అవార్డులు ప్రదానం చేశారు.
అవార్డులు అందుకున్న వారిలో అచ్చంపేట రేంజ్ అధికారి ఎం.ఎ. సుబ్బుర్, స్ట్రైక్ ఫోర్స్ రేంజ్ అధికారి మాక్దూమ్ హుస్సేన్, కొల్లాపూర్ సెక్షన్ అధికారి ఎం.డి. ముజీబ్ ఘోరి, దోమలపెంట సెక్షన్ అధికారి రామాంజనేయులు, కొల్లాపూర్ బీట్ అధికారి లలిత, దోమలపెంట బీట్ అధికారి ప్రవీణ్, బయాలజిస్ట్ రవికాంత్, ఎన్జీవో హేటికస్కు చెందిన బాపురెడ్డి, కొల్లాపూర్ బేస్ క్యాంప్ వాచర్లు రాంబాబు, కృష్ణ, అమ్రాబాద్ కంప్యూటర్ ఆపరేటర్ జహీర్, మాచారం బేస్ క్యాంప్ వాచర్ లక్ష్మయ్య, అమ్రాబాద్ అనిమల్ వాచర్ విష్ణు, మన్ననూర్ సఫారీ డ్రైవర్ మళ్లినాథ్ ఉన్నారు.
ఈ సందర్భంగా ఫీల్డ్ డైరెక్టర్ ప్రసాద్, జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో ముగ్గురు, రాష్ట్ర స్థాయిలో 14 మంది కలిపి మొత్తం 17 మంది అధికారులు, సిబ్బంది ప్రతిభా పురస్కారాలు అందుకోవడం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు గర్వకారణమన్నారు.
అటవీ సిబ్బంది అంకితభావం, విధి నిర్వహణలో నిబద్ధత, పులుల సంరక్షణలో సాధించిన ఫలితాలకు ఈ అవార్డులు నిదర్శనమని పేర్కొన్నారు. అవార్డులు అందుకున్న అధికారులను, సిబ్బందిని జిల్లా అటవీ శాఖ అధికారులు, సహోద్యోగులు అభినందించారు. ఈ గుర్తింపు తెలంగాణ అటవీ శాఖకు, ముఖ్యంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత ప్రతిష్ఠను తీసుకువచ్చిందని తెలిపారు.
