దేవాలయాల పరిరక్షణతో దైవభక్తి, దేశభక్తి పెంపొందాలి

  • పరిపూర్ణానంద భారతి స్వామీజీ

ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేవాలయాలను పరిరక్షిస్తూ దైవభక్తి, దేశభక్తి, ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని హంపి మాతంగా పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద భారతి స్వామీజీ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ ఊర లక్ష్మమ్మ దేవాలయంలో అమావాస్య సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మానికి దేవాలయాలు నిలయాలని పేర్కొన్నారు. ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా సమాజానికి నైతిక విలువలు, సన్మార్గం, సేవాభావాన్ని బోధించే ఆధ్యాత్మిక కేంద్రాలని అన్నారు. దేవాలయాల అభివృద్ధి, పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, యువత భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

నిత్య పూజలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొంటాయని స్వామీజీ చెప్పారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరిస్తూ సమాజంలో సోదరభావం, పరస్పర సహకారాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం రేణుక భరత్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్, మాజీ ఎంపిటిసి హన్మంతు, భక్తులు నరసింహారెడ్డి శంకర్ కోరం శివారెడ్డి, జయ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.