బెల్లంపల్లిలో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
96.5 మి.మీ వర్షపాతం నమోదు..
చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. బుధవారం నాటికి పట్టణంలో 96.5 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పట్టణంలోని ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లోకి నీరు చేరడంతో ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పట్టణంలో పలు రహదారులపై నీటితో పాటు పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెలలు గడుస్తున్నా రోడ్డు విస్తరణ పనులు ఎందుకు నిలిచిపోయాయో అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చి, రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.
