వరి ధాన్యం కోతలపై రైతుల ఆందోళన..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఐకేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లలో అధిక కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆందోళనకు దిగారు. క్వింటాల్‌కు 13 కిలోల వరకు ధాన్యం కోత విధించడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఉట్నూర్ రైస్‌మిల్ సమీపంలోని ప్రధాన రహదారిపై వరి ధాన్య బస్తాలతో రైతులు ధర్నా నిర్వహించారు. గంటకు పైగా కొనసాగిన ఈ ధర్నాకు బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ, కొనుగోళ్లలో జాప్యం చేయడమే కాకుండా క్వింటాల్‌కు 13 కిలోల వరకు కోతలు విధించడం రైతులకు అన్యాయం చేయడమేనని విమర్శించారు.
రైతులపై భారంగా మారుతున్న ఈ కోతలను తగ్గించి, గరిష్ఠంగా క్వింటాల్‌కు రెండు కిలోల వరకు మాత్రమే కోత విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐకేపీ, రైస్‌మిల్ నిర్వాహకుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ రఘునాథ్‌రావు, ఉట్నూర్ సీఐ మాడవి ప్రసాద్, ఎస్ఐ విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే, జిల్లా కలెక్టర్ లేదా ఐటీడీఏ పీఓ స్పందించి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని రైతులు స్పష్టం చేశారు.
చివరకు జిల్లా కలెక్టర్ ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడి, వారి డిమాండ్లను పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
రైతుల ధర్నాతో ఉట్నూర్–దంతన్‌పల్లి–మంచిర్యాల ప్రధాన రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
