SIR | డూప్లికేట్ ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక హెచ్చరిక

  • ఎన్టీఆర్ జిల్లాలో 25,384.. కృష్ణాలో 28,426 డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు
  • జూలై 24లోపు బీఎల్‌ఓకు వివరాలు ఇవ్వాలి
  • అందించకపోతే రెండు చోట్లా ఓటు తొలగే అవకాశం
  • జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
  • పేరు లేకుంటే వెంటనే అభ్యంతరం నమోదు
  • తిరిగి ఓటుకు అవకాశం కల్పించిన కేంద్ర ఎన్నికల సంఘం
  • ఓటు హక్కు పరిరక్షణకు ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరు నమోదై ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ ఓటు ఎక్కడ కొనసాగించాలనుకుంటున్నారో సంబంధిత బూత్ లెవల్ అధికారి (బీఎల్‌ఓ)కు తెలియజేయాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 25,384 మంది, కృష్ణా జిల్లాలో 28,426 మంది రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రత్యేక ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఇంటి వద్ద అందుబాటులో లేని మరో 34,732 మంది ఓటర్ల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

గడువులోపు స్పందించకపోతే…

జూలై 24లోపు సంబంధిత బీఎల్‌ఓను, బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ) లను కలిసి “నా ఓటు ఈ నియోజకవర్గంలోనే కొనసాగించండి” అని స్పష్టత ఇస్తే అక్కడికక్కడే మ్యాపింగ్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియకు ప్రత్యేక దరఖాస్తులు, అదనపు పత్రాలు అవసరం ఉండవని పేర్కొన్నారు. ఒకవేళ గడువులోపు స్పందించకపోతే రెండు చోట్ల ఉన్న ఓటుపై సందేహాలు తలెత్తి ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత ఫారం-6, 8 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయడం, పత్రాలు సమర్పించడం, విచారణలకు హాజరుకావడం వంటి ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.

జూలై 31న ముసాయిదా జాబితా..

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ముసాయిదా జాబితా వెలువడిన వెంటనే ప్రతి ఓటరు తమ పేరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని ఎన్నికల అధికారులు సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు తమ పరిధిలో రెండు చోట్ల ఓటు ఉన్న వారిని, ఇంటి వద్ద అందుబాటులో లేని వారిని గుర్తించి ఫోన్ లేదా ప్రత్యక్షంగా సంప్రదించి జూలై 24లోపు మ్యాపింగ్ పూర్తయ్యేలా చూడాలని అధికారులు కోరుతున్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు కావడంతో నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.