India UK Trade Deal | తెలంగాణకు కొత్త ప‌రిశ్ర‌మ‌లు

భారత్–బ్రిటన్ వాణిజ్య ఒప్పందంతో తెలంగాణకు కొత్త అవకాశాలు
యూకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రు కె. అయ్యర్‌తో మంత్రి భేటీ
ఎగుమతుల పెంపు, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధిపై చర్చ

India UK Trade Deal | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత్–బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (India–UK Comprehensive Economic and Trade Agreement – CETA) ద్వారా తెలంగాణకు లభించే అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు సచివాలయంలో యూకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ (దక్షిణాసియా) చంద్రు కె. అయ్యర్, ఆయన ప్రతినిధి బృందంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఎగుమతుల విస్తరణ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, స్థానిక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాల కల్పన వంటి అంశాలపై చర్చించారు.

భారత్–యూకే వాణిజ్య ఒప్పందం వల్ల ఏర్పడే అవకాశాలను తెలంగాణ పరిశ్రమలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర ఎగుమతి వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, తయారీ రంగానికి ప్రోత్సాహం అందించడం, స్థానిక ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో గుర్తింపు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. తెలంగాణను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. భారత్–బ్రిటన్ వాణిజ్య సంబంధాలు బలోపేతం కావడం ద్వారా తెలంగాణలో కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.