దేవాదాయ శాఖలో చారిత్రాత్మక నియామకాలు..
రాష్ట్రవ్యాప్తంగా 191 పోస్టులకు నియామక పత్రాల ప్రదానం
వేములవాడ రాజన్న ఆలయానికి 21 పోస్టుల కేటాయింపు
వేములవాడ ,హైదరాబాద్, ఆంద్రప్రభ : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 191 పోస్టులను భర్తీ చేస్తూ నియామక పత్రాలను అందజేసింది. రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీ ఎం. హనుమంతరావు, ధార్మిక సలహాదారు శ్రీ గోవింద హరి ప్రత్యేక చొరవతో నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
నియామక పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీ ఎం. హనుమంతరావు, ధార్మిక సలహాదారు శ్రీ గోవింద హరి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ శ్రీ బసవరాజ్ శ్రీనివాస్, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి, సీత (SITA) డైరెక్టర్ డాక్టర్ విజయ రాఘవాచార్యులు పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేసిన 191 పోస్టుల్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడకు 21 పోస్టులు కేటాయించారు. వీటిలో 11 పరిచారకులు, 2 వైష్ణవ అర్చకులు, 2 తమ్మల అర్చకులు, ఒక అసిస్టెంట్ కుక్, ఒక శృతి వాద్యకారుడు, 2 డోలు వాద్యకారులు, 2 సన్నాయి వాద్యకారుల పోస్టులు ఉన్నాయి.
దాదాపు 14 సంవత్సరాల తరువాత దేవాదాయ ధర్మాదాయ శాఖలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టడం విశేషం. ఆలయాల్లో నెలకొన్న సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు అర్చక వ్యవస్థను బలోపేతం చేయడం, సాంప్రదాయ వాద్య కళాకారులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, భోజన వసతి సహా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించింది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో ఎల్. రమాదేవి ఎంపికైన అభ్యర్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమం అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరఫున హాజరైన ఉన్నతాధికారులకు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేసి ఘనంగా సత్కరించారు.
హిందూ దేవాలయాల అభివృద్ధి, ధార్మిక సేవల విస్తరణ, ఆలయ సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడే ఈ 191 నియామకాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

