నేషనల్స్‌కు దూసుకెళ్లిన మైలవరం బలవీరులు

  • జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మైలవరం క్రీడాకారుల ఎంపిక
  • మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్ష
  • ఫిట్ జోన్ జిమ్ క్రీడాకారులకు ఘన అభినందనలు

మైలవరం, ఆంధ్రప్రభ: మైలవరం ఫిట్ జోన్ జిమ్‌కు చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక కావడంతో పట్టణంలో ఆనంద వాతావరణం నెలకొంది. మహారాష్ట్రలో ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు ఔరంగాబాద్ (ఛత్రపతి సాంబాజీ నగర్)లోని గర్కడే స్టేడియంలో నిర్వహించనున్న 40 సంవత్సరాలు పైబడిన మాస్టర్స్ విభాగం జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్లో వీరు పాల్గొననున్నారు.

గత నెల అమలాపురంలో జరిగిన క్లాసిక్ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన మర్రి శ్రీలక్ష్మి (69 కిలోల విభాగం), పీత ప్రదీప్ కుమార్ (74 కిలోల విభాగం), ప్రత్తి నరసింహారావు (93 కిలోల విభాగం) జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీలకు బయలుదేరుతున్న సందర్భంగా క్రీడాకారులను, వారి కోచ్ బుడిపుటి వెంకట్రావును ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గంటా వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి వరి మల్లేశ్వరరావు, మైలవరం పట్టణ ప్రముఖులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మైలవరం పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కోచ్ బుడిపుటి వెంకట్రావు మాట్లాడుతూ, క్రీడాకారులు కఠోర సాధనతో పోటీలకు సిద్ధమయ్యారని, జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారనే పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.