CMP Pad Technology | హైదరాబాద్‌లో తొలి సీఎంపీ టెక్నాలజీ హబ్
ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
దేశంలోనే తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ కేంద్రం టీ-వర్క్స్‌లో ప్రారంభం
సెమీకండక్టర్ రంగానికి ఊతం..
18–24 నెలల్లో దేశీయ సీఎంపీ ప్యాడ్ల తయారీ లక్ష్యమన్న మంత్రి శ్రీధర్‌బాబు
CMP Pad Technology | ఆంధ్ర్రప్రభ వెబ్‌డెస్క్ : సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలోనే తొలి సీఎంపీ (కెమికల్ మెకానికల్ పాలిషింగ్) ప్యాడ్ టెక్నాలజీ హబ్ హైదరాబాద్‌లోని టీ-వర్క్స్ కేంద్రంలో ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం ఈ హబ్‌ను ప్రారంభించారు. జపాన్‌కు చెందిన తోహో కోకి సంస్థ సాంకేతిక సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
సెమీకండక్టర్ చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన సీఎంపీ ప్యాడ్ సాంకేతికత దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి రావడం ద్వారా స్వదేశీ సెమీకండక్టర్ పరిశ్రమకు కొత్త ఊపు లభించనుంది. ఈ హబ్ ద్వారా విద్యార్థులు, స్టార్టప్‌లు, పరిశోధకులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ పొందడంతో పాటు పరిశోధన, ప్రోటోటైప్ అభివృద్ధి, ఉత్పత్తి రూపకల్పనకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, రాబోయే 18 నుంచి 24 నెలల్లో దేశీయంగా సీఎంపీ ప్యాడ్ల తయారీ ప్రారంభించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సెమీకండక్టర్ తయారీకి అవసరమైన కీలక సాంకేతికతలను తెలంగాణలోనే అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని దేశంలోని ప్రముఖ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
జపాన్‌తో సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ టెక్నాలజీల అభివృద్ధికి ఈ హబ్ కీలక వేదికగా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ప్రోటోటైపింగ్, చిప్ తయారీ వరకు సమగ్ర సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను తెలంగాణలో నిర్మించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఆయన వెల్లడించారు.
